రామగుండం: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్, రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం సీఐ కృష్ణకుమార్,ఎస్‌ఐ సంధ్యారాణి ఆధ్వర్యంలో గంజాయి,ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ,తమ ఆశలు,ఆకాంక్షలను పిల్లలపై పెట్టి పాఠశాలలకు పంపిస్తున్నారని అన్నారు.విద్యార్థులు తమ విద్యా లక్ష్యాన్ని విజయవంతంగా సాధించి మంచి ఫలితాలు సాధిస్తే, అది తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా గర్వకారణమవుతుందని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా తీవ్ర నష్టాలు సంభవిస్తాయని తెలిపారు.డ్రగ్స్ వినియోగం,అక్రమ రవాణా వల్ల కలిగే ప్రమాదాలపై విద్యార్థులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండడంతో పాటు, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు,పరిసర ప్రాంత ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.
ఎవరైనా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు లేదా వాటి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇందుకోసం అత్యవసర సహాయ సంఖ్య 100 లేదా సంబంధిత హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
మాదకద్రవ్యాల నిర్మూలన ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని,సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరిస్తేనే డ్రగ్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ దిశగా విద్యార్థులు ముందుండి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
మాదకద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణాపై జరుగుతున్న పోరాటంలో నేను చురుకైన భాగస్వామిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.నేను డ్రగ్స్‌కు దూరంగా ఉండే జీవన విధానాన్ని అనుసరిస్తాను.నా చుట్టూ ఉన్న ఎవరూ మాదకద్రవ్యాల ప్రభావానికి లోనుకాకుండా చూసేందుకు కృషి చేస్తాను.డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామిగా ఉండేందుకు అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.”ఈ కార్యక్రమంలో విశ్వభారతి స్కూల్స్ డైరెక్టర్ యాదగిరి గౌడ్,నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి గౌడ్, సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపాల్ జోసెఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

