ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం గోపాల్పేట మండల కేంద్రంలో నిర్వహించిన బీఎల్ఏల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోపాల్పేట, ఏదుల, రేవల్లి మండలాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదని, నిర్లక్ష్యం వహిస్తే అధిష్టానం సీరియస్గా ఉంటుందని హెచ్చరించారు.
మిగిలి ఉన్న 20 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతిరోజూ ఉదయం 7 నుండి 10 గంటల వరకు ఇళ్లకు వెళ్లి అర్హులైన వారందరి ఓట్లను నమోదు చేయాలని సూచించారు. ఓటరు నమోదుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ప్రతిపక్షాలు దొంగ ఓట్ల నమోదుకు ప్రయత్నిస్తున్నాయని, కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి అక్రమాలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.

