Thursday, July 16, 2026

Buy now

కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి

పెద్దపల్లి : కులం పేరుతో దూషించి, ప్రాణహాని కలిగించేలా బెదిరించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పాలకుర్తి మండలం రాణపూర్ గ్రామానికి చెందిన మడిపెల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్మయ్య కథనం ప్రకారం, తనకు చెందిన వ్యవసాయ భూమి మీదుగా రోడ్డు నిర్మాణం చేపడుతూ, తన అనుమతి లేకుండానే భూమిలోని మట్టిని తొలగించారని తెలిపారు.

అంతేకాకుండా, తన తండ్రి మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని కూడా తవ్వి, అక్కడి అవశేషాలను పక్కకు పడేశారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బయ్యపు మనోహర్ రెడ్డి తనను ఎస్సీ కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్య పదజాలంతో అవమానించి, “చంపేస్తాను” అంటూ బెదిరించాడని పేర్కొన్నారు.

అంతేకాకుండా, రోడ్డు వేయడానికి కలెక్టర్ అనుమతి ఇచ్చారు. నువ్వు అడిగే హక్కు లేదు. దళితుడివి కాబట్టి బతికి పోయావు, బీసీ కులానికి చెందినవాడివైతే ఇప్పుడే చంపేసేవాడిని అంటూ తన అనుచరుల సమక్షంలో బెదిరించాడని లక్ష్మయ్య ఆరోపించారు. ఈ ఘటనను బాలగాని కుమార్, సంగెం నర్సయ్య, కాండ్ర శంకర్ తదితరులు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు.

ఘటనపై సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యపు మనోహర్ రెడ్డి వల్ల తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పేర్కొన్న లక్ష్మయ్య, తనపై కులం పేరుతో దూషించి, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

Related Articles

spot_img

Most Popular