Thursday, July 16, 2026

Buy now

అభివృద్ధి బాటలో ఉమ్మడి పాలమూరు జిల్లా!

​* వనపర్తిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ
​* నాగర్‌కర్నూల్‌లో రూ.12 కోట్లతో నూతన బస్ స్టేషన్‌కు శంకుస్థాపన
* ​మంత్రులు పొంగులేటి, పొన్నం, జూపల్లి, వాకిటి శ్రీహరి పర్యటన

​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రుల పర్యటనతో సంక్షేమ, అభివృద్ధి పనుల జోరు పెరిగింది. బుధవారం వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు.

మంత్రి పొంగులేటి ​వనపర్తి కలెక్టరేట్‌లో స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి కలిసి అర్హులైన పేదలకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… గుడిసెల్లో ఉండే ప్రతి పేదవాడికి శాశ్వత గృహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 3.5 లక్షలతో మొత్తంగా రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల భారం మోపినా, ఇచ్చిన హామీల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందన్నారు. వనపర్తికి మరో 2 వేల ఇళ్లు అదనంగా ఇవ్వాలని సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ఈ సందర్భంగా మంత్రిని కోరారు.

​నాగర్‌కర్నూల్‌లో రూ.12 కోట్లతో మోడ్రన్ బస్ స్టేషన్
​రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కలిసి నాగర్‌కర్నూల్‌లో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన టీజీఎస్‌ఆర్టీసీ బస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం నాగర్‌కర్నూల్-వనపర్తి నూతన బస్సును ప్రారంభించి ప్రయాణించారు. అత్యాధునిక వసతులతో ఈ బస్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

​గురుకులంలో ఆకస్మిక తనిఖీ..

అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం, వసతుల నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ సునీత రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular