Thursday, July 16, 2026

Buy now

సింగరేణిపై కేంద్రానికి సవతి ప్రేమ ఎందుకు:డిప్యూటీ సీఎం భట్టి

గోదావరి బెల్ట్‌లోని కోల్ బ్లాక్‌లన్నీ సింగరేణికే ఇవ్వాలి,
తాడిచర్ల 2 కొత్త కోల్ బ్లాక్ కాదు.. పెండింగ్ లీజుకే అనుమతి
కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటంతోనే మైనింగ్ లీజుకు అనుమతి,
కేంద్రం కొత్తగా కేటాయించినట్లు ప్రచారం చేయడం వాస్తవ విరుద్ధం,

2013 నుంచి సింగరేణి కోల్ బ్లాక్ ఎందుకు పెండింగ్‌లో ఉంది?సింగరేణికి వేల కోట్ల నష్టం. కేంద్రానిదే బాధ్యత!
మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.తాడిచెర్ల-2 కోల్ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా సింగరేణికి కేటాయించినట్లు ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. ఈ కోల్ బ్లాక్‌ను 2013లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కంపెనీకి అధికారికంగా కేటాయించిందని, ప్రస్తుతం కేంద్రం ఇచ్చింది కొత్త కేటాయింపు కాదని, కేవలం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మైనింగ్ లీజ్‌కు ముందస్తు అనుమతి మాత్రమేనని తెలిపారు.

2013 సెప్టెంబర్ 16న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక లేఖను మీడియా ముందుంచి, తాడిచెర్ల-2 కోల్ బ్లాక్‌ను సింగరేణికి అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. సింగరేణి భవిష్యత్ అవసరాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా, సంస్థలో తగ్గుతున్న నిల్వలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు.

ఈ కోల్ బ్లాక్ గిరిజన భూముల్లో ఉండటంతో ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే మైనింగ్ చేసే హక్కు ఉంటుందని, ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వమే 2013లో తన లేఖలో స్పష్టం చేసిందన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే 2022లో కోయగూడెం బ్లాక్-3, 2024లో సత్తుపల్లి బ్లాక్-3, తదనంతరం మణుగూరు ప్రాంతంలోని బ్లాకులను వేలానికి పెట్టడం చట్టస్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

తాడిచెర్ల-2 బ్లాక్ ఇప్పటికే సింగరేణికి కేటాయించబడినప్పటికీ, మైనింగ్ లీజ్‌కు అవసరమైన ముందస్తు అనుమతిని కేంద్ర ప్రభుత్వం దాదాపు దశాబ్దకాలం పెండింగ్‌లో ఉంచిందన్నారు. దీంతో సింగరేణికి వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు. ఈ నష్టానికి కేంద్రానిది బాధ్యత కాదా!

ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కేంద్రాన్ని ఒత్తిడి చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను పలుమార్లు కేంద్ర బొగ్గు మంత్రులు ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డిని కలిసి పూర్తి ఆధారాలతో వినతిపత్రాలు సమర్పించామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి 2013 కేటాయింపు చరిత్రను వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగానే ఇప్పుడు మైనింగ్ లీజ్‌కు అనుమతి లభించిందన్నారు.

కొత్తగా కోల్ బ్లాక్ కేటాయించినట్లు ప్రచారం చేయడం కంటే, ఇప్పటికే కేటాయించిన బ్లాక్‌కు మైనింగ్ లీజ్ మంజూరు చేశామని చెప్పి ఉంటే వాస్తవానికి దగ్గరగా ఉండేదని వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన అనుమతిని స్వాగతిస్తున్నప్పటికీ, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు.

గోదావరి బొగ్గు బెల్ట్‌లోని అన్ని కోల్ బ్లాక్‌లను వేలానికి పెట్టకుండా సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికే (G2G) కేటాయింపులు చేయడం సాధ్యమేనని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని కోల్ బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా చట్టబద్ధంగా సింగరేణికే అప్పగించాలని కోరారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో సింగరేణికి కల్పించిన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ హోదాను బీజేపీ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఆ హోదా లేకపోవడంతో పర్యావరణ, అటవీ తదితర అనుమతుల ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు. ఆ హోదాను పునరుద్ధరించాలని కేంద్ర బొగ్గు మంత్రిని మరోసారి కోరినట్లు తెలిపారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని దశలవారీగా చెల్లిస్తూ సంస్థ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సింగరేణి ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular