* బాధిత కుటుంబానికి వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల నాయకుల పరామర్శ
* కేసును నీరుగారిస్తే చట్టపరంగా పోరాడుతాం.. కొమ్ము చెన్నకేశవులు
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను, కులం పేరుతో చేసే దూషణలను ఎంతమాత్రం సహించబోమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు హెచ్చరించారు. మండల పరిధిలోని బాధిత కుటుంబ సభ్యుడు తగరం వెంకటస్వామిని వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం పరామర్శించి, తమ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా చెన్నకేశవులు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా నేటికీ దళితులపై వివక్ష చూపడం దారుణమన్నారు. బాధితుడిపై దాడి చేసిన వారిపై నమోదైన అట్రాసిటీ కేసును అధికారులు నీరుగార్చాలని చూస్తే చట్టపరంగా ఉన్నత న్యాయస్థానాలను, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
అట్రాసిటీ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ అండతో దళిత నాయకులపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. దళితులకు అండగా ఉండాల్సిన స్వయానా దళిత సర్పంచే నిందితులకు కొమ్ముకాయడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు, చిన్నంబావి మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

