హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు.
గురుకుల పాఠశాలలు విద్యార్థులకు సురక్షితమైన విద్యా నిలయాలుగా ఉండాల్సిందిపోయి, ప్రాణాపాయ కేంద్రాలుగా మారుతున్న పరిస్థితి అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. మన్ననూరు గురుకుల పాఠశాలలో ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులకు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించి, వారు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.
పాఠశాలలో కనీసం తాగడానికి శుభ్రమైన నీరు కూడా అందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
విద్యాశాఖ, సంక్షేమ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, గురుకులాల్లో వడ్డించే ఆహార నాణ్యతతో పాటు వంటశాలల పరిశుభ్రతను పర్యవేక్షించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
ఈ ఘటనకు బాధ్యులైన పాఠశాల సిబ్బంది, వార్డెన్, సంబంధిత ఏజెన్సీపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

