ఉద్యోగాన్ని పవిత్రంగా భావించి బాధ్యతతో విధులు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా గురువారం కలెక్టరేట్లో అందజేశారు. నూతనంగా ఉద్యోగాల్లో చేరనున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ శాఖలో 17 మంది, గాంధీ ఆసుపత్రిలో ఒకరు, ఏసీబీ కార్యాలయంలో ఒకరు, ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఒకరు, ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఒకరు చొప్పున మొత్తం 21 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు.
ఉద్యోగం అనేది కేవలం ఉపాధి మాత్రమే కాకుండా ప్రజాసేవకు అవకాశం అని పేర్కొన్న కలెక్టర్, ఉద్యోగాన్ని పవిత్రంగా భావించి అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని నూతన ఉద్యోగులకు సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏవో వెంకట్రామిరెడ్డి, సంబంధిత సెక్షన్ సిబ్బంది, నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

