పాలకుర్తి మండలం,బసంత్‌నగర్: రామగుండం నియోజకవర్గంలోని బసంత్‌నగర్‌లో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో సిమెంట్ రవాణాకు లారీలకు బదులుగా వ్యాగన్‌లను వినియోగించడాన్ని నిరసిస్తూ స్థానిక లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు.
కర్మాగారం ప్రధాన గేటు సమీపంలో టెంట్ ఏర్పాటు చేసి **”వ్యాగాన్ వద్దు.. లారీ ముద్దు”** అనే నినాదాలతో లారీ యజమానులు, డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. వ్యాగన్‌ల వినియోగం వల్ల స్థానిక లారీ యజమానులు, డ్రైవర్లకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ధర్నాకు కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరీ సంఘీభావం ప్రకటించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు లారీ అసోసియేషన్‌కు పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొంటూ ధర్నా శిబిరంలో నాయకులతో కలిసి కూర్చొన్నారు.
స్థానిక లారీ కార్మికుల ఉపాధిని కాపాడేలా కంపెనీ యాజమాన్యం తక్షణమే స్పందించి, లారీల ద్వారానే సిమెంట్ రవాణా కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ధర్నాను కొనసాగిస్తామని లారీ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.

