సూర్యాపేట: హుజూర్నగర్ పట్టణంలో ఇద్దరు చిన్నారులను వారి తల్లిదండ్రులు తీవ్రంగా హింసించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం ప్రకారం, నకిరికంటి రవి, ఇందు దంపతులు హుజూర్నగర్లో అద్దె ఇంట్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ధనుష్, రేవంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలను తరచూ కొడుతూ శారీరకంగా హింసిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గురువారం ఇద్దరు చిన్నారులను తీవ్రంగా కొట్టడమే కాకుండా, వారి చేతులు, కాళ్లపై వేడి గరిటెతో కాల్చినట్లు సమాచారం. చిన్నారుల పరిస్థితిని చూసి చలించిన స్థానికులు వారిని వెంటనే హుజూర్నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్లో ఎస్సై నరేష్ చిన్నారుల పరిస్థితిని గమనించి వారికి భోజనం ఏర్పాటు చేయడంతో పాటు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం చిన్నారులను తాత్కాలికంగా స్థానికుల సంరక్షణకు అప్పగించారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులను ఎస్సై నరేష్ హెచ్చరించారు. అవసరమైతే చిన్నారులను బాలల సంరక్షణ గృహంలో (చైల్డ్ హోమ్) చేర్పించే చర్యలు కూడా తీసుకుంటామని ఆయన తెలిపారు.పిల్లలపై హింసకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

