Thursday, July 16, 2026

Buy now

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ప్రెస్‌మీట్: సింగరేణిలో రూ.16 వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపణ

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలు సింగరేణి సంస్థ, బొగ్గు గనుల వేలం, కాంగ్రెస్-బీజేపీ ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని పేర్కొంటూ, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణిని లాభాల బాట పట్టించడంతో పాటు కారుణ్య నియామకాలు కల్పించారని తెలిపారు.

జీవో 76 ద్వారా వేలాది కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం, ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కేసీఆర్ కృషి ఫలితమేనని పేర్కొన్నారు. గనుల వేలానికి సంబంధించిన ఎంఎంటీఆర్ బిల్లును తాను ఎంపీగా వ్యతిరేకించానని, బీఆర్ఎస్ ఆ చట్టానికి నిరసనగా లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిందని గుర్తుచేశారు. సింగరేణి బొగ్గు బావులను వేలం వేయొద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ లేఖ కూడా రాశారని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కుంభకోణాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో ఓబీ టెండర్లలో అవకతవకలు జరిగాయని, 42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుకు సంబంధించిన రూ.1,600 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో మొత్తం రూ.16 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

సింగరేణిలో బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు వెళ్లిన తమ పార్టీ నేత హరీష్‌రావును పోలీసులు అడ్డుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజిల్ కుంభకోణానికి తెరలేపిందని విమర్శించారు. పంపకాల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు రావడంతో నైని బొగ్గు బ్లాక్ టెండర్‌ను రద్దు చేశారని ఆరోపించారు.

బడే బాయ్, చోటే బాయ్ మధ్యలో మిడిల్ బాయ్‌గా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యవహరిస్తూ అందరూ కలిసి సింగరేణిని ముంచుతున్నారని విమర్శించారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్–2ను సాధించామని బీజేపీ, కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.

మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే వెంటనే ఎన్‌డీఎస్‌ఏను పంపించిన కేంద్రం, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డి సింగరేణిలో వందల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

హరీష్‌రావు ఆధారాలతో సహా సింగరేణి అవినీతిని బయటపెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలు, కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి కుమ్మక్కు కావడం వల్లే సింగరేణిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు.చివరగా, రాష్ట్రంలోని అన్ని ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పగించాలని, కొత్త ఓపెన్‌కాస్ట్ బొగ్గు బ్లాక్‌లను నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

Related Articles

spot_img

Most Popular