Thursday, July 16, 2026

Buy now

గ్రామాల్లో సుపరిపాలనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్

ప్రజానావ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో సుపరిపాలన అందించాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం కడ కార్యాలయంలో వికారాబాద్, నారాయణపేట జిల్లాల అధికారులు, కొడంగల్ నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి, నారాయణపేట కలెక్టర్ ప్రియాంకతో కలిసి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ గ్రామాల్లో అధికారులు నిరంతరం పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పరిశీలించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో అంతర్గత మురుగు కాలువలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను మంజూరు చేసి విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అధికారులు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగితే గ్రామాల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు.

గ్రామపంచాయతీలను అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షిస్తూ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో సుపరిపాలన అందిస్తున్నామనే విషయాన్ని పనితీరుతో నిరూపించుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు.

సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అదనపు కలెక్టర్ వెంకటాచారి, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, వ్యవసాయ అధికారి కవిత, ఉద్యానవన శాఖ అధికారి సత్తార్, ఆర్డీవో వాసు చంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular