ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: పోలీసు కార్యాలయాల పనితీరే ప్రజల విశ్వాసానికి పునాది అని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆమె వనపర్తి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కార్యాలయంలోని క్రైం డైజెస్టర్, విలేజ్ రోస్టర్, పిటిషన్ రిజిస్టర్లను, పెండింగ్ కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేయాలని సీఐని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

