Thursday, July 16, 2026

Buy now

అర్హులైన పేదలందరికీ ‘ఇందిరమ్మ ఇళ్ళు’ కేటాయించాలి: సిపిఐ డిమాండ్

● ​ఏడాదిన్నరలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి
● కల్వకుర్తి, జూరాల పెండింగ్ పనులపై పాలకుల నిర్లక్ష్యం ఎందుకు..?

ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో​: రాష్ట్రంలో అర్హులైన పేద ప్రజలందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సిపిఐ రాజకీయ శిక్షణా తరగతులు వనపర్తిలోని సురవరం సుధాకర్ రెడ్డి గారి ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. జూలై 10 నుండి 12 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతుల సందర్భంగా సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు.

​ఇందిరమ్మ కమిటీల జోక్యం వద్దు

​ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం, ప్రస్తుతం సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావిస్తోందని సిపిఐ నాయకులు ఆరోపించారు. అర్హులైన పేదలకు కాకుండా, అధికార పార్టీ నేతలు తమ అనుయాయులకే పథకాలను కట్టబెడుతున్నారని వారు మండిపడ్డారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ‘ఇందిరమ్మ కమిటీల’ జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వాటి సంతకాలు ఉంటేనే ఇళ్ళు కేటాయిస్తామనే నిబంధనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

​ఇళ్ళ స్థలాలు లేని పేదలకు భూసేకరణ చేయాలి

​గతంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇళ్ళ స్థలాల కోసం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. నిలువ నీడ లేని, ఇళ్ళ స్థలాలు లేని పేదలందరికీ ప్రభుత్వమే స్వయంగా భూసేకరణ చేసి ఇళ్ళ స్థలాల పట్టాలు ఇవ్వాలని సిపిఐ స్పష్టం చేసింది. గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, సీనియర్ మంత్రులు సైతం ప్రభుత్వ నిబంధనలను పాటించేలా చూడాలని కోరారు.

పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

​ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నర కాలపరిమితి విధించుకుని, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. దీంతో పాటు జిల్లాలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, జూరాల ప్రాజెక్ట్, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో పాలకులు సమాధానం చెప్పాలన్నారు. ఈ ప్రాజెక్టుల పెండింగ్ పనులకు వస్తున్న అడ్డంకులను తొలగించి, తక్షణమే జిల్లాకు సాగునీరు మరియు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular