గోదావరిఖని,ప్రజానావ బ్యూరో:గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.
శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మద్దతు పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు సింగరేణి బొగ్గు అంశం, కన్నెపల్లి అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి దోపిడీకి గురిచేసిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. మెడికల్ దందా ద్వారా టిబీజీకేఎస్ నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్న వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్ విచారణ జరిపి అరెస్టులు చేసిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో గడీల పాలన కొనసాగిందని, ప్రస్తుతం ప్రజల కోసం పనిచేసే ప్రజాపాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. రామగుండం నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.
ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

