* భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
హైదరాబాద్,ప్రజానావ బ్యూరో: హైదరాబాద్‌లో ప్రతి ఏటా నిర్వహించే ఆషాఢ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పండుగల సందర్భంగా హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం, వారు ప్రదర్శించే లౌకిక స్ఫూర్తి దేశానికి గొప్ప సందేశాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.
గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన ఆషాఢ బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో మంత్రి కొండా సురేఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బోనాల జాతర పోస్టర్, బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జూలై 16న లంగర్ హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే బోనం సమర్పణ, తొట్టెల ఊరేగింపు, రథోత్సవం, మెట్ల పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అగ్నిమాపక సదుపాయాలు, ప్రత్యేక బస్సులు వంటి ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని స్పష్టం చేశారు.
దేవాలయ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే రహదారులు, మెట్లు, హైమాస్ట్ లైట్లు, సూచిక బోర్డులు, షెడ్లు తదితర సౌకర్యాలు ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.
బోనాల ఉత్సవాల కాలమంతా పోలీస్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అనుమానితుల ఫొటోలతో కూడిన వాల్ పోస్టర్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
దైవానికే అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సహకరించాలని మంత్రి పేర్కొన్నారు. భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని, సంతృప్తిగా ఇళ్లకు చేరేలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహోత్సవమని పేర్కొన్న మంత్రి కొండా సురేఖ, భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందన్నారు.
అనంతరం గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆలయంలో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో పచ్చగా కళకళలాడాలని, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ సమావేశంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, పోలీస్, ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

