Wednesday, July 15, 2026

Buy now

తయారీ రంగానికి తెలంగాణ అత్యంత అనుకూలం:మంత్రి శ్రీధర్ బాబు

జర్మన్ పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్,ప్రజానావ బ్యూరో,:తయారీ రంగంలో పరిశ్రమల స్థాపనకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆయన జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు.

శుక్రవారం డా. బీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బవేరియన్ (జర్మనీ) మినిస్ట్రీ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్, రీజినల్ డెవలప్‌మెంట్ అండ్ ఎనర్జీ వైస్ మినిస్టర్ టోబియాస్ గోత్‌హార్ట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ–జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం తదితర అంశాలపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో తెలంగాణను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు.

లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, సెమీకండక్టర్లు, ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ హెల్త్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, క్లీన్ ఎనర్జీ, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఇండస్ట్రీ 4.0 వంటి రంగాల్లో తెలంగాణలో విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వివరించారు.

అత్యాధునిక సాంకేతికత, పరిశోధన, ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ–జర్మనీ భాగస్వామ్యాన్ని పెట్టుబడులకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాలకు కూడా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్, హైదరాబాద్‌లో జర్మనీ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్, బవేరియా ఆర్థిక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉల్రికే హాఫ్‌మన్, బవేరియా ఇండియా కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ కొట్టాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular