* అశ్వారావుపేటలో నాయక్‌పోడ్ గూడెం ప్రజలతో తెలంగాణ రక్షణ సేన చీఫ్ ముఖాముఖి
ప్రజానావ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం:తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట మండలం కొత్తగంగారం నాయక్‌పోడ్ గూడెం ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి హక్కుల సాధన కోసం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నాయక్‌పోడ్ వర్గానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పిస్తూ, ఆ వర్గానికి చెందిన నాయకులను శాసనసభకు పంపించేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే తెలంగాణ రక్షణ సేనను స్థాపించామని చెప్పారు. మహిళలు సంకల్పిస్తే సాధించగలరని, అదే ధైర్యంతో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీలు, ముస్లింలు ఇంకా అభివృద్ధికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా సమీప గ్రామాలకు విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. విద్య, ఉద్యోగాలు, మహిళలకు ఉపాధి, పేదల ఇళ్ల రక్షణ వంటి అంశాల్లో మార్పు వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
నాయక్‌పోడ్ వర్గం ఇప్పటికీ తమ అస్తిత్వాన్ని గుర్తించాల్సిన పరిస్థితి ఉందని, జనాభా లెక్కల్లో కూడా సరైన గుర్తింపు లేకపోవడం అన్యాయమని అన్నారు. నాయక్‌పోడ్‌లకు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులుగా అవకాశాలు రావాలని, తమ పార్టీ నుంచే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుగా ఉండాలని కవిత అన్నారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా విద్యను అభ్యసించే పరిస్థితి రావాలని, వైద్యం కూడా ఉచితంగా అందేలా వ్యవస్థను రూపొందించాలని పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లు ఆలస్యం కావడం వల్ల విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ప్రస్తావించారు.
యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని, వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ప్రభుత్వమే నేరుగా రుణాలు అందించే విధానం తీసుకొస్తామని తెలిపారు. రైతులను ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవించేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, రైతును నిజంగా రాజుగా నిలబెట్టే విధానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణే తమ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ, జీవో నంబర్–3 అమలు, ఐటీడీఏ ఏర్పాటు, నాయక్‌పోడ్ వర్గ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి పోరాడతామని చెప్పారు. మహిళలకు సముచిత న్యాయం చేయడమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని, ప్రజల ఆశీర్వాదంతో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తామని కవిత పేర్కొన్నారు.

