* సింగరేణి మెడికల్ కాలేజీలో ఎలక్ట్రిక్ బస్సు, క్రీడా వసతులకు హామీ
ప్రజానావ బ్యూరో, గోదావరిఖని: గోదావరిఖనిలోని సింగరేణి మెడికల్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక ప్రకటనలు చేశారు.
విద్యార్థుల సౌకర్యార్థం కాలేజీ నుంచి ఆసుపత్రి వరకు రాకపోకల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సును ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా వీక్షించి, వారి ప్రతిభను అభినందించారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

