ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో: కోర్టు కేసుల సత్వర విచారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి సూచించారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు డ్యూటీ, లైజన్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు, పోక్సో, హత్య, దోపిడీ వంటి తీవ్రమైన కేసుల్లో సాక్షులు సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చూడాలన్నారు.
దర్యాప్తు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులతో సమన్వయం చేసుకుంటూ నిందితులకు శిక్షలు పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలు సమర్పించాలని, పెండింగ్ సమన్లు, వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, ఇన్స్పెక్టర్ నర్సింలు, ఐటీ సెల్ ఎస్ఐ రవి, కోర్టు లైజన్ అధికారులు పాల్గొన్నారు.

