* డీఈఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నిరసన
* ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో విద్యాశాఖ పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రైవేట్ పాఠశాలల అక్రమాలు, కేజీబీవీల్లోని సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైన జిల్లా విద్యాధికారి (డీఈఓ)ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం MSF, AISF, BSF, UISF, బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రెండేళ్లుగా అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, ఈ ఏడాది దానికి అనుమతులు ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా పుస్తకాల విక్రయాలు సాగుతున్నా అధికారులు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. ఇటీవల నాగనూలు కేజీబీవీలో పురుగుల అన్నం పెడుతున్నా డీఈఓ స్పందించలేదని, తిమ్మాజిపేట కేజీబీవీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బదిలీ అయిన ప్రత్యేక అధికారి సుజాతే ఇప్పటికీ అక్కడి పరిపాలనను శాసిస్తున్నా చర్యలు లేవన్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగిని ఆన్‌లైన్‌లో మరణించినట్లు చూపినా విచారణ జరపకపోవడం విచారకరమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై, కేజీబీవీల లోపాలపై సమగ్ర విచారణ జరిపి డీఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రేమ్ కుమార్, బుక్కాపురం మహేష్, సాయిబాబు, సయ్యద్, డేగ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

