ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, యువత తమ జీవిత లక్ష్యాలపై దృష్టి సారించినప్పుడే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థినుల భద్రతపై సోమవారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఒకసారి వ్యసనాలకు బానిసైతే విద్య, ఆరోగ్యం, జీవిత లక్ష్యాలన్నీ దెబ్బతింటాయన్నారు. అంతకుముందు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన సుమారు 400 మంది విద్యార్థులకు యాంటీ డ్రగ్ సోల్జర్ సర్టిఫికెట్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సర్టిఫికెట్ సాధించిన ప్రతి విద్యార్థి సమాజంలో చైతన్యం తెచ్చేందుకు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని, 1908 టోల్ ఫ్రీ నెంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అంజాద్, కళాశాల ప్రిన్సిపాల్ నవీన, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

