Wednesday, July 15, 2026

Buy now

కూనారం రోడ్ ఆర్‌ఓబీ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* ప్రతి ఓటరు తో ఎన్యూమరేషన్ ఫారాలు నింపించి డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
* ఫారాలు నింపడంలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలి

ప్రజానావ,పెద్దపల్లి బ్యూరో : పట్టణంలోని కూనారం రోడ్ రైల్వే ఫ్లైఓవర్ (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకుండా వేగవంతంగా పూర్తి చేసి జూలై నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలోని కూనారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌.ఐ.ఆర్) ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కూనారం ఆర్‌ఓబీ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా పనులు కొనసాగాలని అన్నారు. విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బి శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి పనుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. పనుల అమలులో ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని క్షేత్రస్థాయిలోనే వెంటనే పరిష్కరించాలని, జూలై నెలాఖరులోగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను ఈ నెల 18వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి ఓటరిని చైతన్యపరిచి ఎన్యూమరేషన్ ఫారాలు తప్పనిసరిగా నింపించి బీఎల్‌వోలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని తెలిపారు. ఫారాలను తిరిగి బీఎల్‌వోలకు సమర్పించకపోతే ఓటరు నమోదుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రతి ఓటరు ఫారాలను తప్పనిసరిగా అందజేసి డిజిటలైజేషన్ పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి ఈఈ భావ్‌సింగ్, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular