* మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత
* ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
ప్రజానావ,పెద్దపల్లి బ్యూరో : విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని హనుమంతుని పేట, మారేడు గొండ, మూలసాల, గుర్రంపల్లి గ్రామాల్లో డిఎంఎఫ్ టి నిధులు రూ.1.18 కోట్ల వ్యయం తో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, రిపేర్లు, టాయిలెట్స్, కిచెన్ షెడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ రమణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని పలు గ్రామాల్లో రూ.5.70 కోట్ల నిధులు స్కూళ్లలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి మంజూరు పొందినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం అందించడం జరుగుతోందని అన్నారు. నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎస్ఎస్సీ ఫలితాల్లో గత సంవత్సరం రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా అగ్రభాగాన నిలవడం అభినందనీయమని చెప్పారు. ఇందులో పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి మండలం ముందు ఉన్నదని అన్నారు. ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, విద్యాశాఖ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించడం వల్లనే ప్రభుత్వ బడులలో మంచి ఫలితాలు వస్తున్నాయని అభినందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకులు పెద్దపల్లి నియోజకవర్గం లోని ప్రభుత్వ స్కూల్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. తమ సొంత ప్రైవేట్ విద్యాసంస్థల అభివృద్ధిని పెంచుకునేందుకు ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధిని అడ్డుకున్నారని చెప్పారు. హనుమంతుని పేట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 మందికి పెరిగిందన్నారు. ప్రభుత్వ స్కూల్స్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో స్కూల్స్ లలో టీచర్లు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు మేడగొని శ్రీనివాస్, గుర్రం దేవేంద్ర నాగరాజు, సంపత్, కనపర్తి సంపత్ రావు కాంగ్రెస్ నాయకులు కటుకురి సుధాకర్ రెడ్డి, మాదిరెడ్డి నరసింహారెడ్డి, బండారి రామ్మూర్తి, మండల సత్యనారాయణ రెడ్డి, ఆర్కుటి సంతోష్ ఆడెపు వెంకటేశం, గన్నమనేని తిరుపతిరావు, యనగందుల ప్రదీప్, ముత్యాల నరేష్, సుధాకర్ రెడ్డి, వెంకటేష్, రాజేశం, జూపాక శ్వేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు,ప్రజలు పాల్గొన్నారు.

