హైదరాబాద్: బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రా రైస్ మిల్లర్ల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి, తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్టపరిచిందని ఆమె విమర్శించారు. ఈ ప్రక్రియలో సుమారు రూ.2 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పెద్ద రైస్ మిల్లర్లకు ప్రభుత్వానికి దాదాపు రూ.4 వేల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కానీ రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బకాయిలు ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని అన్నారు.
చిన్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, ఈ ఒత్తిడిని తట్టుకోలేక కరీంనగర్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదని కవిత ఆరోపించారు. చిన్న రైస్ మిల్లర్లకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఉన్న దొడ్డు బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌కు కిలో రూ.48 చొప్పున విక్రయించగా, ప్రస్తుత ప్రభుత్వం అదే బియ్యాన్ని రూ.24, అనంతరం రూ.21.70కు విక్రయించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ టెండర్ వ్యవహారంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ 10 వేల టన్నుల బియ్యాన్ని లిఫ్ట్ చేశారని అన్నారు.
పెద్ద రైస్ మిల్లర్లకు ఇచ్చిన టెండర్లను అదే ధరకు చిన్న రైస్ మిల్లర్లకూ ఇవ్వాలని డిమాండ్ చేసిన కవిత, చిన్న మిల్లర్లకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో పీడీఎస్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

