Thursday, July 30, 2026

Buy now

సింగరేణి మెడికల్ బోర్డుపై స్పష్టమైన ప్రకటన చేయాలి: కల్వకుంట్ల కవిత

* ఈ నెల 20లోపు నిర్ణయం లేకుంటే నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరిక**

హైదరాబాద్ ,బంజారాహిల్స్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సింగరేణి కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు హక్కుగా కొనసాగాలని, ఇందుకోసం మెడికల్ బోర్డును కచ్చితంగా ప్రతి నెలా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికులు జీవితాంతం కష్టపడి సమాజానికి సేవ చేస్తున్నారని, వారు కోరుకున్న కుటుంబ సభ్యులకు డిపెండెంట్ ఉద్యోగం ఇచ్చుకునే అవకాశం కల్పించాలని అన్నారు. రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్న కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు డిపెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన తేదీనే ప్రామాణికంగా తీసుకునేలా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు డిపెండెంట్ ఉద్యోగాల అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాము చేపట్టిన “బాయిబాట” కార్యక్రమం తర్వాత ఇతర రాజకీయ పార్టీలు కూడా సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పటికీ, మెడికల్ బోర్డు నిర్వహణపై ఎవరూ మాట్లాడటం లేదన్నారు.

ఈ నెల 20లోపు మెడికల్ బోర్డు నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో తాను నిరవధిక దీక్షకు దిగుతానని మరోసారి స్పష్టం చేశారు. ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించి సమస్యను పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దని, పెండింగ్‌లో ఉన్న అన్ని డిపెండెంట్ ఉద్యోగాలు పూర్తయ్యే వరకు నెలకు రెండుసార్లు, అనంతరం ప్రతి నెలా ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మెడికల్ బోర్డు కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా పనిచేయాలని, అవినీతి లేదా అక్రమ వసూళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, తాడిచర్ల గని కేటాయింపుతోనే పరిమితం కాకుండా, ఇంకా పెండింగ్‌లో ఉన్న 17 బొగ్గు బ్లాకులను కూడా బేషరతుగా సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోల్ ఇండియాలో అమలవుతున్న మంచి విధానాలను సింగరేణిలో కూడా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

అదేవిధంగా వేజ్ బోర్డు అమలు, పెర్క్స్‌పై ఆదాయపన్ను (ఐటీ) మినహాయింపు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Related Articles

spot_img

Most Popular