Wednesday, July 15, 2026

Buy now

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు మంత్రి హోదా

* స్వగ్రామం మానాలలో సంబరాలు.. ప్రాంత అభివృద్ధిపై ఆశాభావం

జగిత్యాల:తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నర్సింగ్‌రావుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

శాసనమండలి ప్రభుత్వ విప్‌గా ఆయన నియామకం ఈ ఏడాది మార్చి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ఆ పదవికి అనుబంధంగా రాష్ట్ర మంత్రి స్థాయి హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ హోదా ఆయన విప్‌గా కొనసాగే పూర్తి పదవీకాలం వరకు వర్తిస్తుందని, ఇది వ్యక్తిగత హోదా మాత్రమేనని, వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్‌లో ఎలాంటి అధికారిక మార్పు ఉండదని పేర్కొంది.

ఈ నిర్ణయంతో జగిత్యాల జిల్లా మల్యాల మండలం “మానాల గ్రామంలో” ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. బల్మూరి వెంకట్ జన్మస్థలం మానాల గ్రామమే కాగా, అనంతరం ఆయన కుటుంబం పెద్దపల్లి జిల్లాలో స్థిరపడి అక్కడి నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్నత స్థాయికి చేరుకోవడంతో ఆయనకు మంత్రి హోదా లభించడం పట్ల గ్రామస్థులు, బంధువులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి హోదాతో తమ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా నియమితులైన తర్వాత కూడా వెంకట్ తన స్వగ్రామంలోని బంధువులు, సన్నిహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని వారు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తదితర అధికారులు బల్మూరి వెంకట్‌కు మంత్రి హోదాకు అనుగుణంగా ప్రోటోకాల్, అధికారిక మర్యాదలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

spot_img

Most Popular