రామగుండం: రాష్ట్రంలో లొంగిపోయిన సీపీఐ (మావోయిస్టు) కేడర్లకు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో “ఆరోగ్య రక్షణ” పథకం కింద సమగ్ర ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.452 ను సమత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ స్వాగతించారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రధాన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు కుటుంబాలకు ఈ నిర్ణయం భరోసా కల్పిస్తుందని అన్నారు. డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసి, వార్షిక మాస్టర్ హెల్త్ చెకప్‌లతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలనే ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.
హిమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ, కాలేయ పరీక్షలతో పాటు మహిళలకు మామోగ్రఫీ, పురుషులకు పీఎస్‌ఏ వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు అందించడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ వైద్య సేవల అమలును ఎస్‌ఐబీ ఐజీపీ నోడల్ అధికారిగా పర్యవేక్షిస్తూ, నిమ్స్ యంత్రాంగంతో సమన్వయం చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
వైద్య సేవలతో పాటు లొంగిపోయిన కుటుంబాల శాశ్వత పునరావాసం, జీవనోపాధి, పిల్లల విద్య, ఉపాధి అవకాశాల కల్పనలోనూ ప్రభుత్వం నిరంతరం అండగా నిలవాలని డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ విజ్ఞప్తి చేశారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అణగారిన వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం సమత ఫౌండేషన్ ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

