నల్లగొండ: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం, ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహం, పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీ సందర్భంగా విద్యార్థులతో మంత్రి ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మూగ–చెవిటి విద్యార్థులు సంకేత భాష ద్వారా వివరించిన సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, అవసరమైన ప్రతి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల అవసరాలపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి, ఖాళీ పోస్టుల వివరాలు, అవసరమైన బోధనా సిబ్బంది, ఇతర సౌకర్యాలపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని సహాయ సంచాలకుడు, ప్రిన్సిపాల్‌కు సూచించారు.
విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న మంత్రి, వసతి గృహంలోని ఆహారం, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, తరగతి గదులు, బోధన సౌకర్యాలు, విద్యార్థుల భద్రత వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, సంక్షేమ పథకాల సమర్థ అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు.
దివ్యాంగుల సమస్యలను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా ప్రభుత్వానికి పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

