పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రజలకు ఉపయోగపడేలా ఫలవంతంగా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సమావేశాల ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు సభా కార్యక్రమాల్లో పూర్తి మనసుతో పాల్గొని చర్చలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రైతులకు మేలు చేయాలని, అదే విధంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా దేశ ప్రయోజనాలకు అనుకూలంగా సాగాలని మోదీ అన్నారు. ప్రజా సమస్యలపై సార్థక చర్చలు జరిగేలా సభ్యులందరూ సహకరించాలని కోరారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత్‌కు పలు సవాళ్లు ఎదురయ్యాయని ప్రధాని పేర్కొన్నారు. అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచి 7.7 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషమన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు యువతలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని మోదీ చెప్పారు. గత నెల రోజుల్లో అంతరిక్ష రంగంతో పాటు పలు రంగాల్లో భారత్ కీలక మైలురాళ్లు అధిగమించిందని, దేశ అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

