– ఆస్పత్రి తరలింపును హైకోర్టులో సవాల్ చేసిన భార్య
నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఉంచడంపై వివాదం మరింత ముదిరింది. చికిత్స విషయంలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి జే. ఆంగ్మో సోమవారం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. భర్త చికిత్సపై తుది నిర్ణయం తీసుకునే హక్కు కుటుంబానికే ఉండాలని ఆమె అప్పీల్లో పేర్కొన్నారు.
అప్పీల్లో వాంగ్చుక్ను ఎలాంటి అరెస్టు లేకుండానే ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచడం చట్టవిరుద్ధమని వాదించారు. రోగికి చికిత్సను అంగీకరించే లేదా తిరస్కరించే హక్కు ఉంటుందని, ‘ఇన్ఫార్మ్డ్ కన్సెంట్’ అనే కీలక సూత్రాన్ని ఏకసభ్య ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో పాటు వాంగ్‌చుక్, ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా వైద్య నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఇంతకుముందు ఆదివారం అత్యవసర విచారణ చేపట్టిన జస్టిస్ మినీ పుష్కర్ణ ధర్మాసనం వాంగ్చుక్ను జంతర్‌మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించడం ప్రభుత్వ అధికార పరిధిలోనే జరిగిందని స్పష్టం చేసింది. ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి మార్చాలని ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, వైద్య నిబంధనల ప్రకారమే చికిత్స కొనసాగుతోందని కోర్టు పేర్కొంది. బలవంతపు వైద్యం జరుగుతోందని చెప్పేందుకు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

