* ఎల్ నినో సమీక్షలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
* రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం
ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో: ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు వరి సాగును తగ్గించి తక్కువ నీటితో పండే హార్టికల్చర్ ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన ఎల్ నినో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోకుండా ‘ఉపాధి హామీ’ కింద అదనపు పనిదినాలు కల్పించాలని, చెరువుల్లో నీటిని నిల్వ చేయాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తుగా మేత విత్తనాలు పంపిణీ చేయాలని, నష్ట నివారణకు రైతులు తప్పనిసరిగా పంట బీమా చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

