Tuesday, July 21, 2026

Buy now

హేరా పంచమి సంప్రదాయంలో భాగంగా “అమ్మవారి అలక”

– జగన్నాథ రథయాత్రలో వైభవంగా ‘హేరా పంచమి’
– గుండిచా ఆలయానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు

భువనేశ్వర్‌: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం గుండిచా ఆలయంలో నిర్వహించిన ‘హేరా పంచమి’ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జగన్నాథుడు, మహాలక్ష్మి అమ్మవారి మధ్య దివ్య అనుబంధం, అలకకు ప్రతీకగా ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తారు. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి తొమ్మిది రోజుల పాటు గుండిచా ఆలయంలో కొలువుదీరుతారు. తనను వెంట తీసుకెళ్లకుండా జగన్నాథుడు వెళ్లిపోయారనే భావంతో మహాలక్ష్మి అమ్మవారు అలక ప్రదర్శించడం ‘హేరా పంచమి’ వేడుకలో ప్రధాన ఘట్టంగా భావిస్తారు. సంప్రదాయం ప్రకారం జగన్నాథ ఆలయం నుంచి మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా గుండిచా ఆలయానికి తీసుకువచ్చారు. జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకున్నప్పటికీ అమ్మవారు స్వామివారిని కలుసుకోరనే విశ్వాసం భక్తుల్లో ఉంది.

నందిఘోష్‌ రథానికి ప్రతీకాత్మక స్పర్శ
హేరా పంచమి సంప్రదాయంలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారు జగన్నాథుడి నందిఘోష్‌ రథాన్ని ప్రతీకాత్మకంగా తాకి తిరిగి వెళ్తారు. తనను వెంట తీసుకెళ్లనందుకు అమ్మవారి అలకకు ఇది సంకేతంగా భావిస్తారు. జగన్నాథ సంస్కృతి పరిశోధకుడు భాస్కర్‌ మిశ్రా మాట్లాడుతూ.. ఈ ఆచారం దైవిక ప్రేమ, విరహం, దాంపత్యంలోని అనురాగభరితమైన అలకను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, జూలై 24న జరగనున్న బహుదా యాత్ర (తిరుగు రథయాత్ర)కు హేరా పంచమి వేడుకలతో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గుండిచా ఆలయం వద్ద ఉన్న మూడు రథాలను తిరుగు ప్రయాణానికి సిద్ధం చేసే పనులు చేపట్టారు. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో గుండిచా ఆలయ పరిసరాల్లో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు బలగాలను మోహరించి ట్రాఫిక్‌, భక్తుల రాకపోకలను నియంత్రిస్తున్నట్లు సెంట్రల్‌ రేంజ్‌ డీఐజీ సత్యజిత్‌ నాయక్‌ తెలిపారు.

Related Articles

spot_img

Most Popular