Tuesday, July 21, 2026

Buy now

త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి

– పోలీస్ ప్రధాన కార్యాలయ వాష్‌రూంలో ఉరేసుకున్న అనురాగ్‌ ధంకర్‌
– హైకోర్టు పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు కోరిన సీపీఎం, కాంగ్రెస్
– ఘటనపై మేజిస్ట్రేట్‌ స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశం

అగర్తల: త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధంకర్‌ (60) సోమవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన కార్యాలయ వాష్‌రూంలో అనుమానాస్పదంగా ఉరేసుకొని కనిపించారు. వెంటనే ఆయనను అగర్తల ప్రభుత్వ జీబీపీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా వెల్లడించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్న ఆయన, ధంకర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్‌ ధంకర్‌ గతేడాది త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ విరమణకు ఇంకా సుమారు 11 నెలల సమయం ఉంది. ధంకర్‌కు భార్య, కెనడాలో నివసిస్తున్న కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్న స్వగ్రామానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. 2003–04 మధ్య ఐక్యరాజ్యసమితి కొసోవో మిషన్‌లోనూ ఆయన సేవలందించారు. డీజీపీ మరణానికి దారితీసిన పరిస్థితులపై హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు సీపీఎం, కాంగ్రెస్ డిమాండ్‌ చేశాయి. నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారి బలమైన కారణం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని తాము నమ్మడం లేదని ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి వ్యాఖ్యానించారు. డీజీపీ మృతికి దారితీసిన అసలు కారణాలను ప్రభుత్వం పారదర్శకంగా వెలికితీయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్‌ రాయ్‌ బర్మన్‌ కోరారు. ఇదిలా ఉండగా, అనురాగ్‌ ధంకర్‌ అత్యంత నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించిన పోలీసు అధికారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అభిషేక్‌ దేవ్‌రాయ్‌ కొనియాడారు. ఘటనపై మేజిస్ట్రేట్‌ స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విచారణ ద్వారా వాస్తవాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ధంకర్‌తో కలిసి పనిచేసిన పలువురు అధికారులు కూడా ఆయనను క్రమశిక్షణ, నిజాయితీ, మానవతా దృక్పథం కలిగిన పోలీసు అధికారిగా స్మరించారు.

Related Articles

spot_img

Most Popular