Saturday, August 15, 2026

Buy now

అదనపు కట్నం వేధింపులు.. కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితురాలు

* భర్త, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
* కలెక్టరేట్ ఎదుట బైఠాయించి న్యాయం కోరిన మహిళ

పెద్దపల్లి : అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దపల్లి జిల్లాకు చెందిన భజ్జురి రేఖలత సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దపల్లికి చెందిన రేఖలతకు భీమారం ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్‌తో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం వరకు దాంపత్య జీవితం సజావుగానే సాగినప్పటికీ, అనంతరం అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, ఆయన కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. గతంలో ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో ఇకపై సక్రమంగా చూసుకుంటానని భర్త హామీ ఇచ్చాడని తెలిపారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా ఇంటికి తీసుకెళ్లకుండా వాట్సాప్ సందేశాలు, నోటీసుల ద్వారా వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అలాగే తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని, తనపై భౌతిక దాడులకు పాల్పడ్డాడని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక ఆధారం లేకుండా పెద్దపల్లిలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నానని రేఖలత తెలిపారు. భర్త, ఆయన కుటుంబ సభ్యులు తోటి కోడలు, బావల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Related Articles

spot_img

Most Popular