హైదరాబాద్,అమరజ్యోతి: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం తన సూచనలు, సిఫార్సులతో కూడిన నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయడంలో ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు.
ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్న కవిత.. తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కల్పించిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తాను ఉద్యమకారులతో కలిసి పోరాటం చేసిన వ్యక్తినని, గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్‌లో అంతర్గతంగా పోరాడినందుకే రాజకీయంగా నష్టపోయానని వ్యాఖ్యానించారు.
ఉద్యమకారులకు ప్రయోజనం కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన”, “హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్” నిబంధనలను కమిటీ అధ్యయనం చేయాలని ఆమె సూచించారు. వాటి తరహాలో తెలంగాణ ఉద్యమకారులకు కూడా చట్టబద్ధమైన ప్రయోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించడంతో పాటు, జైలు శిక్ష అనుభవించిన వారు, ఎఫ్ఐఆర్‌లు, ఛార్జిషీట్లు నమోదైన వారు, హౌస్ అరెస్ట్‌కు గురైన వారు, పోలీసు దాడులు ఎదుర్కొన్న వారు, ఆస్తి నష్టం లేదా వికలాంగత్వానికి గురైన వారికి ప్రాధాన్యంగా గుర్తింపు ఇవ్వాలని సూచించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరారు.
జాగృతి సంస్థ ద్వారా ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది కార్యకర్తల వివరాలు తమ వద్ద ఉన్నాయని, కమిటీ కోరితే పూర్తి డేటాతో పాటు ఆధార్ వివరాలు, సంప్రదింపు వివరాలు అందజేస్తామని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న వారి సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంతో వెనుకడుగు వేయకుండా విశాల దృక్పథంతో కమిటీ వ్యవహరించాలని సూచించారు.
ఉద్యమంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు, డీలర్‌షిప్‌లు రద్దు అయిన వారు, వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కూడా న్యాయం చేయాలని, ఉద్యమకారుడు మరణిస్తే అతని భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులకు ప్రయోజనాలు అందేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. స్కీమ్ అమలులో అక్రమాలు చోటుచేసుకోకుండా కఠినమైన విధానాలు తీసుకురావాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 30 నెలల తర్వాత కమిటీ ఏర్పాటు చేయడం విచారకరమని కవిత వ్యాఖ్యానించారు. కేకే కమిటీపై “కాలయాపన కమిటీ” అనే అభిప్రాయం ఉందని, ఆ భావనను తప్పని ఈ కమిటీ నిరూపించాలని అన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యమకారులను గుర్తించి వారికి అందించే ప్రయోజనాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జార్ఖండ్‌లో ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, వారి కుటుంబాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, శాశ్వత కమిటీ వంటి విధానాలు అమలులో ఉన్నాయని గుర్తుచేసిన ఆమె.. గోవా, దాద్రా నగర్ హవేలి, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. చట్టపరమైన ప్రక్రియ పేరుతో సమయం వృథా చేయకుండా ఉద్యమకారులకు త్వరితగతిన న్యాయం చేయాలని కమిటీని విజ్ఞప్తి చేశారు.

