Wednesday, July 22, 2026

Buy now

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రజనావ,వికారాబాద్: వికారాబాద్ జిల్లా హకీంపేటలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుంచి ప్రతి నెలా పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌ను సందర్శించి, వివిధ విద్యాసంస్థల భవన నిర్మాణాలు, ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కళాశాలలు, ఫిజియోథెరపీ–పారా మెడికల్ కళాశాలలు, విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

నిర్మాణ పనులు ఆశించిన వేగంతో సాగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన నెలవారీ పురోగతి నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఇకపై ప్రతి నెలా పనులను పరిశీలించడమే కాకుండా అవసరమైతే ఒక రోజు సైట్‌లోనే బస చేసి పనులను పర్యవేక్షిస్తానని తెలిపారు.

పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడవద్దని స్పష్టం చేశారు.

అదేవిధంగా, ఎడ్యుకేషన్ హబ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా లబ్ధిదారులకు ప్లాట్ల పట్టాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Related Articles

spot_img

Most Popular