Wednesday, July 22, 2026

Buy now

మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీసీపీ ఎ. భాస్కర్

ప్రజనావ,మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ డీసీపీ ఎ. భాస్కర్ మంగళవారం మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు.

డీసీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం రిసెప్షన్, స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలతో పాటు అధికంగా నమోదవుతున్న నేరాల స్వరూపం, రౌడీషీటర్ల వివరాలు, అనుమానితుల ప్రస్తుత పరిస్థితులపై ఇన్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది పనితీరు, విధుల నిర్వహణ సమయాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా డీసీపీ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్ (CCTNS)లో సకాలంలో నమోదు చేయాలని, సాక్ష్యాధారాలను డిజిటల్ రూపంలో అప్‌లోడ్ చేయాలని, వీడియో ఆధారిత దర్యాప్తుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంఘటన స్థలాల వీడియో చిత్రీకరణ, సాక్షుల వాంగ్మూలాల వీడియో రికార్డింగ్ వంటి అంశాలు కేసుల్లో శిక్షలు పడేందుకు దోహదపడతాయని తెలిపారు.

ప్రతి స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీషీటర్ల నివాసాలను సందర్శించి వారి కార్యకలాపాలపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని సూచించారు. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచి, వాటి నియంత్రణకు నిరంతరం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నేరాల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్ కీలకమని పేర్కొన్న డీసీపీ, పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. మంచిర్యాల పట్టణం వ్యాపార కేంద్రంగా, రైల్వే అనుసంధానం కలిగిన ప్రాంతం కావడంతో ఆస్తి సంబంధిత నేరాల నివారణకు బీట్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే బంగారు దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎంలు, ఆర్థిక సంస్థల వద్ద పగలు, రాత్రి వేళల్లో ఆయుధాలతో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, కాలనీలు, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Related Articles

spot_img

Most Popular