Thursday, July 30, 2026

Buy now

“బీజేపీ అంటే బ్రిటీష్ జాహిల్ పార్టీ” – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్:బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, “బ్రిటీష్ జాహిల్ పార్టీ” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఢిల్లీలో నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలిచిందని ఆమె అన్నారు.

బుధవారం విడుదల చేసిన వీడియో సందేశంలో కవిత మాట్లాడుతూ, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన విద్యార్థులపై సీసీటీవీ కెమెరాలు ఆపేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి లాఠీచార్జ్ చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ పాలకులు స్వాతంత్ర్య సమరయోధులపై చూపిన దాష్టీకాలనే నేడు బీజేపీ ప్రభుత్వం సొంత ప్రజలపై ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉందని గుర్తు చేసిన ఆమె, రైతులపై దాడులు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులపై కూడా అదే వైఖరి అవలంబిస్తోందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాడిలో పలువురు గాయపడగా, ఒక విద్యార్థిని ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

“లాఠీ దెబ్బలకు, రక్తం చుక్కలకు సమాధానం తప్పదు”

నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందిన కేంద్ర ప్రభుత్వం, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి విద్యార్థులపై జులుం ప్రదర్శించడం దురదృష్టకరమని కవిత అన్నారు. పేపర్ లీకేజీ కారణంగా 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజీకి బాధ్యులెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వ్యవహారంలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌లో చిందిన ప్రతి రక్తపు చుక్కకు, విరిగిన ప్రతి లాఠీకి ప్రజలు ఓటు రూపంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.

విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. విద్యార్థులు ధైర్యం కోల్పోకుండా ఐక్యంగా ఉండాలని, వారి హక్కుల కోసం రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజాసంఘాలు పోరాడతాయని తెలిపారు.

*గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు అండగా ఉండాలి*

స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్లు రోజంతా శ్రమిస్తున్నప్పటికీ వారి ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

అగ్రిగేటర్ సంస్థలు గిగ్ వర్కర్లకు న్యాయమైన ఆదాయం కల్పించడం లేదని ఆరోపిస్తూ, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సంస్థలతో చర్చించి ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలవాలని, గిగ్ వర్కర్లు, డ్రైవర్ల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular