* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రాథమిక నైపుణ్యాలు అందించాలి
* అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్లు, పీహెచ్సీలలో సేవల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
* భూముల రీ సర్వేను ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా నిర్వహించాలి
* రెవెన్యూ శాఖలో పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి
* పెద్దపల్లి, ధర్మారం, జూలపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి : ప్రభుత్వ శాఖల పనితీరు క్షేత్రస్థాయిలో మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పెద్దపల్లి, ధర్మారం, జూలపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్ ఎంపీపీఎస్ పాఠశాల, ప్రభుత్వ సమీకృత సంక్షేమ బాలికల హాస్టల్ సముదాయం, పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి ఎం.పీ.పీ.ఎస్, జడ్పీ.హెచ్.ఎస్, అంగన్వాడీ కేంద్రం, రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాగినేడు జడ్పీ.హెచ్.ఎస్, బొంపల్లి జడ్పీ.హెచ్.ఎస్ ప్రాథమిక పాఠశాల, ధర్మారం మండలంలోని పైడి చింతలపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే, జూలపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, వంటి ప్రాథమిక నైపుణ్యాలు పూర్తిస్థాయిలో సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని, విద్యా ప్రమాణాల పెంపే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సమీకృత సంక్షేమ బాలికల హాస్టల్ సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థినులకు అందుతున్న ఆహారం, వసతి, పరిశుభ్రత, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. హాస్టళ్లలో ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బ్రాహ్మణపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఎదుగుదల, పోషకాహార పంపిణీని పరిశీలించిన కలెక్టర్ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్లు, పాలు తదితర ఆహారాన్ని సకాలంలో అందించాలని సూచించారు. ప్రతి చిన్నారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రి పనితీరును మెరుగుపరచాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి సాధ్యమైనంత ఎక్కువ వైద్య సేవలను స్థానికంగానే అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలోని జడ్పి.హెచ్.ఎస్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల హాజరు వివరాలు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉదయం పాఠశాల లో అందిస్తున్న రాగి జావా నాణ్యత పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మారం మండలంలోని పైడి చింతలపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ రీ సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా రైతులకు రీ సర్వే ప్రయోజనాలను వివరించి ప్రజల పూర్తి సహకారంతో ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. జూలపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఇతర పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు జాప్యం లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడం ప్రతి అధికారికి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

