* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* 21వ శతాబ్దపు నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి
* ఏఐ, ఐసీటీ ఆధారిత బోధనా విధానాలను సమర్థవంతంగా వినియోగించాలి
పెద్దపల్లి : విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా లోని ప్రధాానోపా ధ్యాయుల మూడురోజుల ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనా నైపుణ్యాలను నిరంతరం మెరుగు పరుచుకుంటూ ప్రతి విద్యార్థి నిర్దేశిత లెర్నింగ్ అవుట్‌కమ్స్ సాధించేలా హెఎమ్ లు, రెమిడియలు తరగతులు నిర్వాహించాలని అన్నారు. ముఖ్యంగా చదవడం (రీడింగ్), రాయడం (రైటింగ్), విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్), సమస్య పరిష్కార నైపుణ్యాలు (ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్), కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన కొనసాగించాలని తెలిపారు. అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి రిమీడియల్ తరగతులు నిర్వహించడం ద్వారా అవసరమైన విద్యా సహాయాన్ని అందించాలని, ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో అవసరమైన అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (ఎఐ)వినియోగం, బోధనలో ఏఐ టూల్స్‌ను ఉపయోగించి సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపై రిసోర్స్ పర్సన్లు శిక్షణ అందించారు. అదేవిధంగా ఐసీటీ ఆధారిత బోధనలో భాగంగా దీక్ష యాప్ వినియోగం, శిక్షా ఫౌండేషన్ రూపొందించిన శిక్ష కో-పైలట్ వేదికను విద్యాబోధనలో ఉపయోగించే విధానాన్ని వివరించారు. బొమ్మలు, ఆటల ఆధారిత సైన్స్ బోధన, తరగతి గదిలో పాఠ్యపుస్తకాన్ని సమర్థవంతంగా వినియోగించడం, అభ్యాస దీపికలు, ప్రభుత్వం అందించే వర్క్‌బుక్‌ల వినియోగం, ప్రయోగాత్మక బోధనలో ల్యాబొరేటరీ మాన్యువల్‌ను తప్పనిసరిగా ఉపయోగించాల్సిన అవసరాన్ని రిసోర్స్ పర్సన్లు అన్నపూర్ణ, లక్ష్మణ్, రాగమాయి, మల్లారెడ్డి లు వివరించారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులతో కలెక్టర్ ప్రత్యక్షంగా ముచ్చటించి, శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కృత్యాధారిత (యాక్టివిటీ బేస్డ్) బోధన ద్వారా విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. గత సంవత్సరం నిర్వహించిన శిక్షణతో పోలిస్తే ఈ ఏడాది శిక్షణలో పొందుపరిచిన ముఖ్యాంశాలను మరోసారి పునశ్చరణ చేసుకుని, వాటిని తరగతి గదిలో అమలు చేసి విద్యార్థులను ఉత్తమ ప్రగతి దిశగా నడిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెఎం లు పాల్గొన్నారు.

