ప్రజనావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేష్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. న్యాయం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. తక్షణమే లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత కోసం తగిన సంస్కరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

