* ఎసన్వాయి లో జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు.
* 1000 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం, 30 లీటర్ల గుడుంబా స్వాధీనం
* 9 మందిపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు.
* సరైన పత్రాలు లేని 35 వాహనాలు సీజ్
మంచిర్యాల జిల్లా / ప్రజానావ న్యూస్ :నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి) ఐపీఎస్. మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు సమన్వయం తో శనివారం తెల్లవారుజామున కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎసన్వాయి గ్రామంలో ఆకస్మికంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించారు. 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 30 మంది ఎక్సైజ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ నివాసితుల వివరాలను సేకరించారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా లేదా అనుమానాస్పద వ్యక్తులు తలదాచుకుంటున్నారా అనే కోణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించి, సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించడం, నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించిన ఆయన, ముఖ్యంగా ‘అరైవ్ అలైవ్’ ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, అతి వేగం వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఆయన ఉదాహరణలతో వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల పత్రాలను కలిగి ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఏదైనా ఆపద కలిగితే వెంటనే స్థానిక పోలీసులకు లేదా ‘డయల్ 100’ కు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల రక్షణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అవి నేరాల అదుపులో కీలక పాత్ర పోషిస్తాయని సూచించారు. అనంతరం, గ్రామంలోని గుడుంబా ప్రభావిత ప్రాంతాలపై ఎక్సైజ్ పోలీసులు సివిల్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి, సుమారు 1000 లీటర్ల బెల్లపు పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే 30 లీటర్ల నిషిద్ధ గుడుంబాను స్వాధీనం చేసుకుని, దాని తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న 9మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు చెన్నూర్ ఎక్సైజ్ సీఐ హరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ ఆర్. కృష్ణ, ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీ రామ్ రెడ్డి (ట్రైనీ) ఎక్సైజ్ సీఐలు సమ్మయ్య, అక్బర్ హుస్సేన్, కోటపల్లి ఎస్సై, నిల్వాయి ఎస్ఐ, ఎక్సైజ్ ఎస్ఐ రమణ, ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

