హైదరాబాద్,జూలై 27: తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా మరో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 23 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించిన ఆమె, రెండో విడతలో మరో 19 నియోజకవర్గాలకు బాధ్యతలు అప్పగించారు.
ఈ రెండో విడత జాబితాలో కూడా బీసీలకే అధిక ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 19 అసెంబ్లీ స్థానాల్లో 10 మందికి బీసీ వర్గాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పించారు. అలాగే 9 లోక్సభ నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలను నియమించారు.అదే సమయంలో తెలంగాణ రక్షణ సేన అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు సహా పలు కీలక పదవులకు నాయకులను ప్రకటించారు. అన్ని నియామకాలలోనూ బీసీ వర్గాలకు పెద్దపీట వేయడం విశేషం.తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పడాల మనోజ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కనగల చైతన్య, ఉపాధ్యక్షురాలిగా అయిలి కవితను నియమించారు.
తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జానపాటి రాము యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మునుకుంట్ల నవీన్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా చింతలపాటి రాధశ్రీని నియమించారు.తెలంగాణ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అల్లంపల్లి రామకోటి, ప్రధాన కార్యదర్శిగా గొరిగె నర్సింహా, ఉపాధ్యక్షులుగా కుసుమ రజిత, ఈదులకంటి శైలజ గౌడ్లను నియమించారు.అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాలను కూడా ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నడిపెల్లి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కుందూరు దేవేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలిగా సుమలత సుధాకర్ శర్మను నియమించినట్లు పార్టీ వెల్లడించింది.

