గోదావరిఖని: భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎఫ్సీఎల్ ప్రాంతం నుంచి డ్రైనేజీ కాలువల ద్వారా వరద నీరు వీర్లపల్లి గ్రామంలోకి చేరుతున్న నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ పరిశీలనలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్‌రావు, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్.. భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం అధికంగా ఉన్నందున ప్రజలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా గుర్తించి, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు 24×7 అప్రమత్తంగా ఉంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని కమిషనర్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, నదుల్లో వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున ప్రజలు వాటి వద్దకు వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
వర్షపు నీటి కారణంగా రహదారులపై వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నందున వాహనదారులు పరిమిత వేగంతో, అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలని కమిషనర్ సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు, నదుల వద్దకు సెల్ఫీలు దిగేందుకు లేదా ఈత కొట్టేందుకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించేందుకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని కమిషనర్ తెలిపారు. ఎలాంటి అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే డయల్-100కు కాల్ చేయాలని లేదా సమీపంలోని పోలీసు అధికారులను సంప్రదించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు సూచించారు.

