Friday, August 7, 2026

Buy now

ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే మూలస్తంభం

* సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క**

హైదరాబాద్, జూలై 29:ఢిల్లీలోని ఏఐసీసీ జాతీయ కార్యాలయం ఇందిరా భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని బలోపేతం చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, రానున్న ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఓటు హక్కే మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ఈ నేపథ్యంలో ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వారు చేపడుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఏఐసీసీ అభినందించిందన్నారు. మిగిలిన ఓటరు నమోదు ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ చేరేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో రూపొందించినట్లు భట్టి తెలిపారు.భవిష్యత్తులో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు ఆయన చెప్పారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పారదర్శక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో చర్చించి ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను పార్టీ అధిష్ఠానానికి సమర్పించేలా మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు.

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం, సంక్షేమ పథకాల విస్తరణ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు అనే మూడు ప్రధాన అంశాలపై సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, వాటి అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Related Articles

spot_img

Most Popular