* చక్కెర పరిశ్రమల పునరుద్ధరణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి: సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్: రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతో పాటు చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, చెరకు సాగు విస్తీర్ణం పెంపు కోసం ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం.86 ప్రకారం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చెరకు రైతు ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 12 చక్కెర కర్మాగారాలు ఉండగా ప్రస్తుతం 7 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే ఏటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరమవుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు.
వరి పంటతో పోలిస్తే చెరకు సాగుకు తక్కువ నీరు అవసరమవుతుందని పేర్కొన్న ఆయన, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయం కూడా తగ్గుతుందన్నారు. 2026–27 వ్యవసాయ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 19 వేల మంది రైతులు 26 వేల హెక్టార్లలో చెరకు సాగు చేస్తున్నట్లు తెలిపారు.
చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచి, చక్కెర పరిశ్రమలకు అవసరమైన ముడి చెరకు లభ్యతను మెరుగుపరిచేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రోత్సాహకాలు, విధానాలను అధ్యయనం చేసి తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో రైతు ప్రతినిధులు మాట్లాడుతూ, చెరకు రైతులకు కూడా వరి రైతుల మాదిరిగా టన్నుకు రూ.500 ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చెరకు సాగులో అధిక పెట్టుబడి, వ్యవసాయ కూలీల కొరత రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని వివరించారు.
చెరకు ద్వారా చక్కెర ఉత్పత్తితో పాటు ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తికి కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చెరకు సాగు, చక్కెర పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.

