* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి బోర్‌వెల్‌కు రీచార్జ్ పిట్, రైతులకు ఫార్మ్‌పాండ్ ఏర్పాటు చేయాలి
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేయాలి
* రెండవ విడత అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలి
* సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ జలసిరి, ఇందిరమ్మ ఇళ్లు పై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
ప్రజానావ,బ్యూరో,పెద్దపల్లి: భూగర్భ జలాలను పెంపొందించి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ జలసిరి కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామీణాభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కార్యక్రమాల అమలు తీరును సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపుదలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ గ్రామాల్లో తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు అవగాహన కల్పిస్తూ వారి అంగీకారంతో పంటకుంటలు (ఫార్మ్‌పాండ్స్) ఏర్పాటు చేయాలని, ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పంటకుంటల ఏర్పాటులో ప్రత్యేక చొరవ చూపాలని, ముఖ్యంగా ప్రతి ఆయిల్‌పామ్ రైతు తప్పనిసరిగా ఫార్మ్‌పాండ్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రతి బోర్‌వెల్ వద్ద రీచార్జ్ పిట్ ఏర్పాటు చేసి భూగర్భ జలాల పునరుద్ధరణకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
మొదటి విడతలో మంజూరు కాకుండా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు గుడిసెల్లో నివసిస్తున్న అర్హుల కోసం ప్రతిపాదించిన గృహాల వివరాలను రేపటిలోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంటి స్థల స్లాబ్ విస్తీర్ణం 750 చదరపు గజాలకు మించకుండా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రతి ఇందిరమ్మ ఇంటికి 90 రోజుల ఉపాధి హామీ పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు సకాలంలో అందేలా పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) నరేందర్, డి.ఆర్.డి.ఓ.కాళిందిని ,పీడీ హౌసింగ్ రాజేశ్వర్, ఎంపీడీవో లు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

