Thursday, July 30, 2026

Buy now

అంబర్‌పేట్ మహంకాళి బోనాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

* అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి.. ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు ఆదేశం

హైదరాబాద్: ఆగస్టు 9న జరగనున్న అంబర్‌పేట్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

అంబర్‌పేట్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీస్, జలమండలి, వైద్యారోగ్య శాఖ, సాంస్కృతిక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

బోనాల ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సీసీ కెమెరాలు, క్యూలైన్లు, వైద్య శిబిరాలు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని హనుమంతరావు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆషాఢ జాతర ఉత్సవాలు జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతున్నాయని, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఉత్సవాల సందర్భంగా జరిగే ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం కార్యక్రమాలు, గావుపట్టడం, సాగనంపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలని ఆయన అన్నారు.

భారీ రద్దీ ఉండే దేవాలయాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు అమలు చేయాలని, అదనపు ఆర్టీసీ బస్సులు, వైద్య బృందాలు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

దేవాదాయ శాఖ, దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా వి. హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశంలో శాసనమండలి సభ్యుడు బల్మూర్ వెంకట్, ఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ వి. పాటిల్, సమాచార–పౌర సంబంధాల శాఖ అదనపు డైరెక్టర్ డి.ఎస్. జగన్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్, వాటర్ వర్క్స్ జీఎం, ఆర్టీసీ ఈడీ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular