Thursday, July 30, 2026

Buy now

పులుల సంరక్షణ అందరి బాధ్యత…మంత్రి కొండా సురేఖ.

* పులిని కాపాడితే అడవి, పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడినట్లే: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్: పులుల సంరక్షణ పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషులకే కాకుండా సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసమని గుర్తించి ప్రకృతి పరిరక్షణకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పులుల ఫోటో ప్రదర్శనను పరిశీలించి, పులుల సంరక్షణపై రూపొందించిన లఘు చిత్రాన్ని వీక్షించారు.

సభలో మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఏడాది జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పులుల సంరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించేందుకు 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు ప్రకృతి పరిరక్షణకు ఒక గొప్ప వేదికగా మారిందన్నారు. పులి అటవీ సంపదకు ప్రతీక అని, పులిని సంరక్షించడం అంటే అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం, భావితరాల భవిష్యత్తును కాపాడటమేనని పేర్కొన్నారు.

వేట, అడవుల నరికివేత, అక్రమ రవాణా కారణంగా ఒకప్పుడు పులుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి, ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని, 1973లో ‘ప్రాజెక్ట్ టైగర్’ను అమలు చేయడం వల్ల దేశంలో పులుల సంరక్షణకు బలమైన పునాది పడిందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం పులుల్లో సుమారు 75 శాతం భారతదేశంలోనే ఉండటం దేశానికి గర్వకారణమని, దేశవ్యాప్తంగా 58 టైగర్ రిజర్వులు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు దేశంలోనే ప్రముఖ పులుల అభయారణ్యాలుగా గుర్తింపు పొందాయని మంత్రి చెప్పారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో నీటి వనరుల అభివృద్ధి, ఆవాసాల మెరుగుదల, ఆధునిక రక్షణ చర్యల వల్ల పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వులో పులుల సంఖ్య పెంచేందుకు ‘టైగర్ రీఇంట్రడక్షన్’ కార్యక్రమం చేపట్టామని, మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వుతో అనుసంధానం చేసి పులుల సహజ సంచారానికి అనుకూల పరిస్థితులు కల్పించినట్లు వివరించారు.

ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు అటవీ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. అడవులను కాపాడాలని, వన్యప్రాణులను సంరక్షించాలని, భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు పులుల సంరక్షణలో తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ఉద్దేశించి అటవీ సంపద పరిరక్షణలో నిబద్ధత, నిజాయితీ, సేవాభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసిన అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. అలాగే అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అటవీదళాల ప్రధాన సంరక్షణాధికారి వినయ్ కుమార్, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ దండా రాజిరెడ్డి, పీసీసీఎఫ్ (డెవలప్‌మెంట్) రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, సీసీఎఫ్ ఎన్. క్షితిజ్, టైగర్ సెల్ రీసెర్చ్ సైంటిస్ట్ అయాన్ సాధు, అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రసాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular